President Message |
సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ నమస్కారం.
సింగపూర్ లోని మన తెలుగు వారు మన మాతృభూమి నుండి దూరంగా ఉన్ననూ మనలో స్నేహం, సోదరభావం, పరస్పర సహకారం,ఐకమత్యం పెంపొందిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మన తెలుగు వారందరిలో సేవా గుణాన్ని కాపాడాలనే గొప్ప లక్ష్యంతో సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటైంది.
5 మార్చ్ 2023 న జరిగిన సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల్లో మీరందరూ నన్ను అధ్యక్షుడుగా,నా సారథ్యంలో మా కమిటీని ఎన్నుకొని చారిత్రాత్మకమైన గెలుపుని ఇచ్చారు. దీనికి మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయాన్ని అందించినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడను. నాపై,మా కమిటీపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని సింగపూర్ లోని తెలుగు వారందరి శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పని చేస్తామని మాట ఇస్తూ నా,మా కమిటీ తొలి మాటలని,చేయబోయే పనుల్ని లక్ష్యాల్ని మీ ముందుకు తెస్తున్నాను.
తెలుగు సమాజం కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది మా ప్రధాన లక్ష్యం. ఈ కార్యాలయం మన సింగపూర్ తెలుగు వారందరూ తమ కష్ట సుఖాలని పంచుకోవటానికి,సహాయ సహకారాలు అందించుకోవటానికి తప్పకుండా మంచి వేదిక అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాకారం చేయడానికి మేము చురుకుగా పని చేస్తూ నిధులను సేకరిస్తున్నాము.
అమెరికా,ఆస్ట్రేలియా,మలేసియా,గల్ఫ్ దేశాలతో సహా ఇతర దేశాల్లోని తెలుగు సంస్థలతో సహాయ సహకారాలు అందించుకుంటూ కలిసి పని చేయడం ద్వారా మన సమాజానికి ఇంకా ఎక్కువ మేలు చేయొచ్చని నేను నమ్ముతున్నాము.
సింగపూర్‌లోని తెలుగు కార్మికులకు అన్ని కంపెనీల్లో భద్రతా పరీక్షల్ని తెలుగులోనే ఉండేలా చేయడం మరో ముఖ్యమైన లక్ష్యం. తెలుగు కార్మికులు మన స్వంత భాషలో పరీక్షలు రాయడం చాలా అవసరమని మేము నమ్ముతున్నాము.దానికోసం ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చేలా కృషి చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. దీని ద్వారా మన తెలుగు వారు పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణత సాధించి వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని,వృత్తిలో,వేతనాల్లో వృద్ధిని సాధించబోతున్నారు. ఫలితంగా వారి కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మరింత పెరగబోతున్నాయి.
సింగపూర్‌లోని కార్మిక సోదరుల కోసం ఏర్పాటైన ప్రత్యేక నిధిని కూడా పెంచుతున్నాం. ఈ నిధి ద్వారా అత్యవసరమైన తెలుగు కార్మికులకు మరింతమందికి ఆర్థిక సహాయం అందిస్తుంది. బతుకుదెరువు కోసం కష్టపడుతున్న వారికి సహాయం చేయడానికి ఇది చాలా అవసరమని మేము నమ్ముతున్నాము.
"మన బడి" కార్యక్రమం ద్వారా పిల్లలకు, పెద్దలకు నామమాత్రపు రుసుముతో తెలుగు భాష నేర్పిస్తున్నాం. సింగపూర్‌లో తెలుగు భాషను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. మన పిల్లలు వారి భాష,వారసత్వం మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మేము నమ్ముతున్నాము.
ఈ లక్ష్యాలతో పాటు, సింగపూర్‌లో తెలుగు పండుగలను ఘనంగా జరుపుకోవడానికి, కళలను ప్రోత్సహించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. మన తెలుగు వారందరూ ఐక్యంగా కలిసి రావడం మరియు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ వీటిని కలిసి జరుపుకోవడం చాలా ముఖ్యం అని మేము నమ్ముతున్నాము. అన్ని ప్రాంతాల తెలుగు వారి పండగల్ని జరపాలని తద్వారా సింగపూర్‌లోని అన్ని ప్రాంతాల,వృత్తుల ప్రజలకు అందుబాటులో ఉండటానికి కూడా కట్టుబడి ఉన్నాము. మన సమాజం ప్రతి ఒక్కరినీ కలుపుకొని,మంచిని మార్పుని స్వాగతించేదిగా ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
చివరగా, సింగపూర్‌లో కష్టాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తికి మేము తోడుగా ఉంటూ,వారికి మద్దతునిచ్చి సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
గత 48 ఏళ్లుగా మన తెలుగు సమాజం చేస్తున్నసేవకి మేము గర్వపడుతున్నాం. సింగపూర్‌లో తెలుగు సంస్కృతిని పరిరక్షించడం మరియు ప్రోత్సహించడంలో మనం గణనీయమైన పురోగతిని సాధించాము. అయితే, ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉందని భావిస్తున్నాను.
మీ అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయగలమని,మరిన్ని విజయాల్ని సాధించగలమని నేను గట్టిగ నమ్ముతున్నాను. సింగపూర్‌లో బలమైన మరియు మరింత శక్తివంతమైన తెలుగు సమాజాన్ని నిర్మించాలన్న మా లక్ష్య సాధనలో మాతో కలిసి పని చెయ్యాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
మీ విలువైన సమయం కేటాయించనందుకు ధన్యవాదాలు.
భవదీయులు,
బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి
అధ్యక్షుడు, సింగపూర్ తెలుగు సమాజం